ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ వివాదాల్లోకి లాగుతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన తాజా రాజకీయ పరిణామాలు, ప్రతిపక్షాల నిరసనలపై స్పందించారు.
ప్రజాస్వామ్యంలో నిరసనలు చేపట్టడం తప్పు కాదని, అయితే అవి హింసాత్మకంగా మారకూడదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆ విజయాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం, ఓటమి ఎదురైనప్పుడు ఈవీఎంలను నిందించడం సరికాదన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధానమంత్రిపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని హితవు పలికారు.
దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ చేస్తున్న ఆరోపణలు అపోహలేనని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఎమ్మెల్యేలు తామే సర్వాధికారులమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే బిల్లుల ఆమోదానికి ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధుల ప్రధాన లక్ష్యం కావాలని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకమవుతూ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేసిన వారే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.