తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో విజయ్ భేటీ కానున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న కీలక అంశాలు, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. అలాగే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ విజయ్ సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తెలుగు గంగ ప్రాజెక్టుపై చర్చ జరిగేనా?

చంద్రబాబు, విజయ్ భేటీలో తెలుగు గంగ ప్రాజెక్టు అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జలాలను సరఫరా చేసేలా తెలుగు గంగ ప్రాజెక్టు రూపొందించారు. అయితే, ఒప్పందం ప్రకారం తమకు అందాల్సిన నీటి వాటాపై తమిళనాడు ప్రభుత్వం పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయించిన నీటిని సక్రమంగా విడుదల చేయాలని విజయ్ కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కొత్త ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించ తలపెట్టిన కొన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, డ్యామ్‌ల అంశాలు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది. ప్రతిపాదిత నిర్మాణాల వల్ల తమిళనాడుకు చేరే నీటి ప్రవాహంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై చర్చించే అవకాశముంది. అయితే, ఈ అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ముఖ్యమంత్రుల భేటీ అనంతరం చర్చల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *