దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని, మెట్రో రైళ్లు, రైలు రవాణా, ఇంటర్నెట్ సేవలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించింది. చట్టానికి లోబడి శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రజలపై అనవసర ఆంక్షలు విధించకూడదని స్పష్టం చేసింది.

జంతర్‌మంతర్‌లో సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మెట్రో రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో పాటు, రాజధానికి వచ్చే రైళ్లను కూడా అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకోవడంతో పాటు, కీలక ఆందోళనకారులను నిర్బంధంలోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆదివారం సెలవు దినమైనప్పటికీ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. జస్టిస్ జైమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ప్రజలు చట్టబద్ధంగా స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్బంధాలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది.

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS)లోని సెక్షన్ 163 కింద చట్టబద్ధమైన ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలను మినహాయిస్తే, ఇతర ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు, నిరాయుధంగా సమావేశమయ్యే ప్రజలపై అనవసర ఆంక్షలు విధించరాదని ధర్మాసనం పేర్కొంది.

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఢిల్లీలో మెట్రో, రైలు సేవలను యథావిధిగా కొనసాగించాలని ఆదేశించింది. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బారికేడ్ల అవసరాన్ని సమీక్షించాలని అధికారులకు స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ సేవలకు అనవసరంగా అంతరాయం కలిగించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తీవ్రమైన శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు తప్ప, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం సమంజసం కాదని పేర్కొంది. ప్రజల హక్కులను కాపాడుతూనే శాంతిభద్రతలను పరిరక్షించేలా ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *