విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బి.కె. వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరిపై జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ కృపాకటాక్షాలు ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాల వేళ అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించడం ఆలయ సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతినిధులకు ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *