విశాఖపట్నంలో భారీ బంగారం స్మగ్లింగ్ యత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భగ్నం చేశారు. పుష్ప సినిమా తరహాలో కారులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య క్యాబిన్లో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి సుమారు రూ.8.98 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు భారీ మొత్తంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో విశాఖపట్నంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కారును తనిఖీ చేయగా బంగారం స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు కారులోని సీటు కింద ప్రత్యేకంగా రహస్య క్యాబిన్‌ను ఏర్పాటు చేసి, అందులో బంగారాన్ని దాచినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో మొత్తం 5,832.90 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ సుమారు రూ.8.98 కోట్లుగా అంచనా వేశారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ చట్టం కింద సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.