సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో సోమవారం భేటీ కావాలని కోరినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. తనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే తాను, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీజేఐకి లేఖ రాసినట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమావేశానికి సమయం కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు.
సర్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులను సీజేఐ దృష్టికి తీసుకెళ్తామని ఖర్గే తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సీజేఐ ముందు ఎలాంటి డిమాండ్లు ఉంచబోమని, తమ ఆందోళనలను మాత్రమే ఆయనతో పంచుకుంటామని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తామని ఖర్గే పేర్కొన్నారు.
మోదీ, అమిత్ షాపై ఖర్గే విమర్శలు
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఖర్గే విమర్శలు గుప్పించారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ప్రధాని, హోంమంత్రి కలిసి దేశంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ పరిణామాలపై తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు.
నిరసనల సందర్భంగా పోలీసుల మోహరింపుపై అభ్యంతరం
ఎస్ఐఆర్ (SIR) నిరసనల సందర్భంగా పోలీసులు తీసుకున్న చర్యలపైనా ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసనల నేపథ్యంలో 32 వేల మంది పోలీసులు, 7,500 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారని పేర్కొన్నారు.
యువతను చూసి ప్రభుత్వం భయపడుతోందనడానికి ఈ భారీ మోహరింపే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు.