• దసరా సెలవులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో శనివారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడింది. అన్ని ప్లాట్‌ఫామ్‌లపై రద్దీ నెలకొంది. విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి నడిచాయి.
  • విజయవాడ పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు విశాఖ లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805), విశాఖ గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240) రైళ్లను ఆశ్రయించారు. బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాలకు వెళ్లేవారు విశాఖ–భువనేశ్వర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (18412), విశాఖ–పార్వతీపురం ప్రత్యేక రైళ్లలో ప్రయాణించారు.
  • మరోవైపు సికింద్రాబాద్‌, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వచ్చిన ప్రయాణికులతోనూ స్టేషన్‌ రద్దీగా మారింది. గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్‌, మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌, కోరమండల్‌, ఎల్‌టిటి, కోణార్క్‌, ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల తాకిడి

  • విజయవాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లేవారు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717) కోసం గంట ముందుగానే స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫామ్‌ ప్రయాణికులతో నిండిపోయింది.
  • విజయవాడ నుంచి వచ్చిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718) మధ్యాహ్నం 12.20 గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుకోగానే జనరల్‌ బోగీల్లో సీట్ల కోసం ప్రయాణికులు పోటీపడ్డారు. రైలు నుంచి దిగుతున్న ప్రయాణికులు, ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నవారు ఒకేసారి ప్రవేశద్వారం వద్దకు చేరుకోవడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది.
  • పరిస్థితిని గమనించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తొక్కిసలాట జరగకుండా చర్యలు చేపట్టారు. విజయవాడ పరిసర ప్రాంతాలకు వెళ్లే మరికొందరు ప్రయాణికులు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727) జనరల్‌ బోగులను ఆశ్రయించారు.

ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బెర్తులన్నీ రిజర్వ్‌

  • దసరా సెలవుల నేపథ్యంలో హౌరా వెళ్లే రైళ్లతో పాటు విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిండిపోయాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), గరీబ్‌రథ్‌ (12739), కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), ఫలక్‌నుమా (12703), ఎల్‌టిటి (18519), ప్రశాంతి (18463), హౌరా యశ్వంత్‌పూర్‌ (12863), కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), మెయిల్‌ (12839), టాటా ఎర్నాకులం (18189), బొకారో (13351) వంటి రైళ్లలో బెర్తులు ముందుగానే రిజర్వు అయ్యాయి.
  • ఆదివారం కూడా గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), గరీబ్‌రథ్‌ (12739), ఎల్‌టిటి (18519), వందేభారత్‌ (20708, 20833) రైళ్లలో బెర్తులు అందుబాటులో లేవు. దీంతో పండుగ సెలవుల్లో ప్రయాణించాలనుకునే వారికి రిజర్వేషన్‌ టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ప్రయాణికుల రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *