
కర్నూలు ప్రతినిధి, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు కర్నూలు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలో మొత్తం 20,09,307 మంది ఓటర్లు ఉండగా, వారి కోసం 2,211 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో ముందుగానే పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో 12.50 లక్షల మంది
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 12,50,166 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,21,167 మంది పురుషులు, 6,28,834 మంది మహిళలు, 165 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తం 648 గ్రామాలకు సంబంధించి 1,432 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
పట్టణాల్లో 7.59 లక్షల మంది ఓటర్లు
కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ పరిధిలో 7,59,141 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,69,070 మంది పురుషులు, 3,89,946 మంది మహిళలు, 175 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఈ నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 779 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
వార్డుల పునర్విభజనతో మార్పులు
వార్డుల పునర్విభజన నేపథ్యంలో ఓటర్లు తమ వార్డు, పోలింగ్ కేంద్రం వివరాలను మరోసారి పరిశీలించుకోవాలి. కర్నూలు నగరపాలక సంస్థలో 68, ఆదోనిలో 52, ఎమ్మిగనూరులో 44, గూడూరులో 23 వార్డులు కలిపి మొత్తం 187 వార్డులు ఉన్నాయి. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.
