
గుంటూరు బ్యూరో, మున్సిపల్ ఎన్నికలకు ఇంకా నగారా మోగకముందే గుంటూరు మేయర్ పీఠం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. నగర మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా గుంటూరు మేయర్ సీటుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతుండగా.. ఈ స్థానాన్ని టీడీపీ తనకే కేటాయించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
గుంటూరు మేయర్ స్థానానికి బదులుగా విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సైతం మరో సీటును కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు, విజయవాడ మేయర్ స్థానాల విషయంలో కూటమి నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇక గుంటూరు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ వ్యవహారంపై వైసీపీ వైపు నుంచి ఇప్పటివరకు పెద్దగా రాజకీయ కదలికలు కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడం వంటి పరిణామాల తర్వాతే మేయర్ పీఠంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
