నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే నిత్యావసర సరకులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 151 రైతు బజార్లలో రాయితీ ధరలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం విజయవాడలోని భవానీపురం రైతు బజార్లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటు ధరల్లో సరకులు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.
రాష్ట్రంలోని 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్న రకం బియ్యాన్ని రూ.49 చొప్పున 26 కిలోల బ్యాగ్‌లో అందిస్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్లో కిలో రూ.85 వరకు ధర పలుకుతున్న నెల్లూరు కేఎన్ఎం రకం బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా కిలో రూ.50కే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
అలాగే మార్కెట్లో కిలో రూ.50 వరకు ధర ఉన్న గోధుమ పిండిని వినియోగదారులకు రూ.25కే అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. రాబోయే రోజుల్లో కందిపప్పు, పామాయిల్‌ను సైతం తక్కువ ధరకే సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఉల్లిపాయల నాణ్యతపై వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకుని నాగ్‌పూర్ నుంచి నాణ్యమైన ఉల్లిపాయలను తెప్పించినట్లు చెప్పారు. కిలో రూ.35 చొప్పున సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో వీటిని విక్రయించనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి అందనున్న లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పును కూడా డీమార్ట్ ధర కంటే 35 శాతం తక్కువకే పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పండుగ సీజన్లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయభాను, అమ్మిశెట్టి వాసు తదితర నాయకులు పాల్గొన్నారు.