
ఖైరతాబాద్, అక్టోబర్ 11 చరిత్రలో జరిగిన గొప్ప ఉద్యమాలు, విప్లవాత్మక మార్పుల్లో యువత పాత్ర కీలకమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సోమాజిగూడలో పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, బీఆర్ఎస్వీ నాయకుడు మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగ సమస్యలపై పట్టభద్రులు గళమెత్తాలన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయ పోరాటాల్లోకి ప్రవేశించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. విద్యావంతులు రాజకీయాలు, ఓటింగ్‌పై నిర్లిప్తత వీడి ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేవలం 8 వేల ఓట్లు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు.
కేటీఆర్ దార్శనికతతో హైదరాబాద్‌కు పెట్టుబడులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందిందని దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రముఖ ఐటీ, ఔషధ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టడం ద్వారా సుమారు 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు లభించాయని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఉన్న సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ, యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
