హైదరాబాద్‌, ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా ఉంది. ఇందులో మెట్రో వాటా రూ.300 కాగా, ఆర్టీసీ వాటా రూ.100గా నిర్ణయించారు. నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500గా ఉండగా, ఇందులో మెట్రోకు రూ.7,000, ఆర్టీసీకి రూ.1,500 కేటాయించారు.

ప్రజలకు అందుబాటులో ఉండేలా ఛార్జీలు

కామన్ పాస్ ధరలు సామాన్య ప్రయాణికులకు భారంగా మారుతున్నాయనే అభిప్రాయాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ఛార్జీలను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

ఈ అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించనున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం కలిగేలా, వారి అవసరాలకు అనుగుణంగా అందుబాటు ధరల్లో కామన్ పాస్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలో తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *