దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు సోమవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
గాయత్రీ దేవి అలంకరణ ప్రత్యేకత ఇదే!
శరన్నవరాత్రుల రెండో రోజున అమ్మవారిని ఐదు ముఖాలతో దర్శనమిచ్చే గాయత్రీ దేవి రూపంలో పూజిస్తారు. త్రిమూర్తుల అంశాలతో విరాజిల్లే గాయత్రీ మాతను ఆరాధించడం వల్ల జ్ఞానం, తేజస్సు, శారీరక ఆరోగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అలాగే సమస్త మంత్రాల సిద్ధి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
తొలిరోజు లక్షమందికి పైగా భక్తుల దర్శనం
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల తొలిరోజైన ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా కనిపించింది. ఒక్కరోజే సుమారు లక్ష మంది భక్తులు బాలా త్రిపురసుందరి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రెండో రోజు దర్శనాల కోసం కూడా భక్తులు రాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మ దర్శనాలు కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగింది.