శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తూ శ్రీశైలం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా లక్షలాది మంది ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం జలాశయం భారీ వరదలను సైతం తట్టుకుని నిలవడం దాని నిర్మాణ పటిష్ఠతకు నిదర్శనమని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్ సామర్థ్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో పట్టిసీమ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడం వల్ల రాయలసీమకు ఎంతో ప్రయోజనం కలిగిందని గొట్టిపాటి రవికుమార్ వివరించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 500 టీఎంసీల నీటిని అందించడం ద్వారా శ్రీశైలం జలాలను రాయలసీమ అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు.
కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందిస్తూనే రాయలసీమ ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో శ్రీశైలం జలాశయం కీలకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించుకోవడం ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో సీఎం చంద్రబాబు దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ పటిష్ఠత, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, బహుళ ప్రయోజనాలు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.