ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను వేగంగా సమర్థంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును సమీక్షించిన సీఎం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశంపై ఆరా తీశారు.
ప్రస్తుతం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా ప్రజల సమస్యలను వీలైనంత మేర పరిష్కరిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల నోడల్ అధికారులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. ఫిర్యాదులు స్వీకరించినప్పటి నుంచి వాటి పరిష్కారం వరకు ఉద్యోగులు, అధికారులపై స్పష్టమైన జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేశారు.
మరోవైపు కొన్ని ప్రభుత్వ శాఖలపై దుష్ప్రచారం జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన జీవోపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
ఇలాంటి ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ, వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.