
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణా నదిపై రెండు ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిల నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు ఈ మేరకు ప్రణాళికల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అమరావతి ఓఆర్‌ఆర్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఈ వంతెనలు నిలవనున్నాయి.
కృష్ణానదిపై రెండు చోట్ల వంతెనలు
అమరావతి ఓఆర్‌ఆర్‌ను ఆరు వరుసలతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా కృష్ణానదిపై రెండు ప్రాంతాల్లో మూడు వరుసల చొప్పున వంతెనలు నిర్మించనున్నారు. ప్యాకేజీ-4లో భాగంగా అమరావతి ఆలయానికి సమీపంలోని మున్నలూరు-ముత్తాయిపాలెం మధ్య 2.90 కిలోమీటర్ల పొడవున రెండు వైపులా వంతెనలు ప్రతిపాదించారు. వీటిలో మధ్యభాగంలో 730 మీటర్ల మేర కేబుల్ బ్రిడ్జిలు నిర్మించనుండగా, మిగిలిన భాగంలో సాధారణ వంతెనలు ఉంటాయి.
అలాగే ప్యాకేజీ-3లో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య వల్లూరుపాలెం-వల్లభాపురం ప్రాంతంలో 5.30 కిలోమీటర్ల మేర రెండు వైపులా వంతెనలు నిర్మించనున్నారు. వీటిలోనూ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.
2018లోనే ప్రతిపాదనలు
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై ఐకానిక్ వంతెనలు నిర్మించాలన్న ప్రతిపాదన కొత్తదేమీ కాదు. 2018లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తరహా వంతెనలను ప్రతిపాదించారు. అయితే, 2024 డిసెంబరులో ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన సమయంలో ఐకానిక్ బ్రిడ్జిల ప్రతిపాదనలను పక్కనపెట్టి, సాధారణ వంతెనల నిర్మాణానికే ప్రాధాన్యమిచ్చారు. తాజాగా ముఖ్యమంత్రి విజ్ఞప్తితో ఈ నిర్ణయంలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.
రూ.38,450 కోట్లతో డీపీఆర్
అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి సంబంధించి తొలుత రూ.38,450 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించారు. అయితే, ప్రాజెక్టు వ్యయం పెరగడంతో కొన్ని మార్పులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిల ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే అమరావతి రవాణా అనుసంధానంతో పాటు రాజధాని ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది.
