
విజయవాడ: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు.
నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై విజయవాడకు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
