ఖమ్మం రూరల్‌, అక్టోబర్‌ 13: గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారితో పాటు, తాజాగా అర్హత సాధించిన గ్రాడ్యుయేట్లు కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలని వైరా మాజీ ఎమ్మెల్యే బి. చంద్రవతి సూచించారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ డివిజన్‌లో బీఆర్ఎస్‌ నేత బానోతు కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి గ్రాడ్యుయేట్లకు ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించారు.

ఈ నెల 25లోగా నమోదు పూర్తి చేయాలి

అనంతరం కృష్ణ క్యాంపు కార్యాలయంలో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఈ నెల 25లోగా నమోదు ప్రక్రియను పూర్తిచేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని చంద్రవతి సూచించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులను నేరుగా కలిసి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలని, అనంతరం ఆన్‌లైన్‌ నమోదు పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.

దూర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రాడ్యుయేట్లకు సైతం సమాచారం అందించి, వారి వివరాలు సేకరించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌ మహిళా నేత బానోత్‌ జ్యోతి, బానోత్‌ కృష్ణ, అన్వేష్‌, స్థానిక యువకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *