మంగళగిరి, ఆంధ్రప్రభ: గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఎన్‌హెచ్‌-67 నుంచి ఆత్మకూరు బైపాస్‌ వరకు రూ.8.91 కోట్లతో అభివృద్ధి చేసిన నాలుగు లేన్ల రహదారిని మంగళవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. 2.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ రహదారికి ‘వాయుపుత్ర మార్గ్‌’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు.

రూ.8.91 కోట్లతో అభివృద్ధి పనులు

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. రహదారి విస్తరణతో ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, ట్రాఫిక్‌ సమస్యలు తగ్గడంతో పాటు ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.6.31 కోట్లతో 2.2 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారిని అభివృద్ధి చేసినట్లు వివరించారు. మరో రూ.2.60 కోట్లతో సెంట్రల్‌ డివైడర్‌, వీధి దీపాలు, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిధులు వినియోగించనున్నారు.

ప్రయాణ ఇబ్బందులకు చెక్‌

గతంలో ఆత్మకూరు పట్టణ ప్రజలు ఎన్‌హెచ్‌-67కు చేరుకునేందుకు ఇరుకైన, గుంతలతో కూడిన రహదారిపై ప్రయాణించాల్సి వచ్చేదని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. దీంతో స్థానికులు, విద్యార్థులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించి పనులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. జాతీయ రహదారిని తలపించేలా నాణ్యతతో రహదారిని అభివృద్ధి చేశామని, మిగిలిన సదుపాయాల పనులు పూర్తయితే మార్గం మరింత ఆకర్షణీయంగా మారుతుందని వివరించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *