నర్సాపురం మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని 36 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. మొత్తం 36 వార్డుల్లో 18 స్థానాలను మహిళలకు కేటాయించడంతో మహిళా అభ్యర్థులకు సగం స్థానాల్లో పోటీ చేసే అవకాశం లభించింది.

గతంలో పట్టణంలో 31 వార్డులు ఉండగా, వాటిని 36కు పెంచారు. తాజాగా ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం ఒక వార్డు ఎస్టీకి, నాలుగు వార్డులు ఎస్సీలకు, 13 వార్డులు బీసీలకు, మిగిలిన 18 వార్డులు జనరల్ కేటగిరీకి కేటాయించారు.

వార్డుల వారీగా రిజర్వేషన్లు

  • ఎస్టీ: 24వ వార్డు
  • ఎస్సీ మహిళ: 32, 33వ వార్డులు
  • ఎస్సీ జనరల్: 22, 34వ వార్డులు
  • బీసీ జనరల్: 1, 9, 13, 16, 20, 28, 30వ వార్డులు
  • బీసీ మహిళ: 2, 3, 5, 10, 15, 19వ వార్డులు
  • జనరల్ మహిళ: 4, 7, 8, 11, 12, 14, 17, 18, 23, 29వ వార్డులు
  • జనరల్: 6, 21, 25, 26, 27, 31, 35, 36వ వార్డులు

మహిళా ఓటర్లే అధికం

నర్సాపురం మున్సిపాలిటీలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. పట్టణంలో మొత్తం 46,996 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 22,389 మంది పురుషులు కాగా, 24,606 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,217 మంది అధికంగా ఉన్నారు.

చైర్మన్ అభ్యర్థిపై కూటమిలో ఉత్కంఠ

రిజర్వేషన్ల ప్రకటనతో నర్సాపురం మున్సిపల్ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఆశావహుల్లో కొందరు నిరాశకు గురయ్యారు. తొలుత ఈ పదవిని ఓపెన్ జనరల్ కేటగిరీకి కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం సాగినప్పటికీ, తాజా ప్రకటనతో పరిస్థితి మారింది.

చైర్మన్ అభ్యర్థి ఎంపికపై కూటమి పార్టీల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పదవి జనసేనకు దక్కుతుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ కూడా తన అభ్యర్థి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ సైతం పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది.

చైర్మన్ అభ్యర్థి ఎంపికపై కూటమి నాయకుల నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో నర్సాపురం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కూటమి ఎవరికి అవకాశం కల్పిస్తుందన్న అంశం పట్టణంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *