
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై విచారణ చేపట్టిన ఈడీ.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించడంతో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి తన న్యాయవాదితో కలిసి హాజరయ్యారు.
ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఈడీ అధికారులు రోజంతా విచారించారు. హత్య కేసులో నిందితులుగా ఉన్నవారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సుమారు రూ.40 కోట్ల మేర జరిగినట్లు పేర్కొంటున్న డీల్స్, నగదు బదిలీలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
కాగా, ఆగస్టు 21న ఈడీ అధికారులు అవినాష్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదుతో పాటు రెండు బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఈడీ విచారణ కొనసాగిస్తోంది.
