అవనిగడ్డలోని తంగిరాల వీరరాఘవయ్య పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు, దాతలు, విద్యాసంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అవనిగడ్డలో పార్క్ కళావిహీనంగా ఉండటం విచారకరమన్నారు. పంచాయతీకి ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన అనంతరం పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. పంచాయతీ నిధులతో చిన్నారులకు ఆట పరికరాలు, పెద్దలకు వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పార్కులో ప్రత్యేక విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు, వాకింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

పార్క్‌కు మరింత ఆకర్షణ తీసుకువచ్చేందుకు అందమైన మొక్కలు నాటి, పచ్చిక బయళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనుల్లో గ్రామ పెద్దలు, దాతలు భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని కోరారు. అవనిగడ్డ రెడ్‌క్రాస్ సొసైటీ సహకరించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామంలోని విద్యాసంస్థలు, ఆర్యవైశ్య సంఘ పెద్దలు, ఇతర ప్రముఖులు కూడా పార్క్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామస్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంత సమయం గడిపేందుకు వీలుగా పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పీ-4 స్ఫూర్తితో ప్రజలు, దాతల భాగస్వామ్యంతో పార్క్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రాం, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *