
హైదరాబాద్ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించనుంది. నగరంలో మరో కొత్త మార్గంలో పుష్పక్ లగ్జరీ ఏసీ బస్సులను నడిపేందుకు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. పటాన్‌చెరు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.
ఐటీ కారిడార్ మీదుగా ఈ బస్సులను నడిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే పటాన్‌చెరు, పరిసర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విమాన ప్రయాణికులకు ఈ సర్వీసులు ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో పుష్పక్ లగ్జరీ ఏసీ బస్సు సేవలను మరింత విస్తరించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఐటీ కారిడార్‌ను అనుసంధానిస్తూ మరో కొత్త మార్గంలో బస్సులను నడపాలని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. పటాన్‌చెరు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కొత్తగా పుష్పక్ ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐటీ కారిడార్ మీదుగా ఈ బస్సులను నడిపితే ప్రయాణికులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 55 పుష్పక్ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. కొత్త మార్గంలోనూ ప్రత్యేకంగా బస్సులను కేటాయించి, వీలైనంత త్వరగా సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఈ సేవలు ప్రారంభమైతే పటాన్‌చెరు, ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
పటాన్‌చెరు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ప్రారంభించనున్న పుష్పక్ లగ్జరీ ఏసీ బస్సులను ఐటీ ఉద్యోగులు, నగర శివారు ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా రూట్ ప్లాన్ చేశారు. ఈ బస్సులు పటాన్‌చెరు నుంచి లింగంపల్లి, నల్లగండ్ల, గోపన్‌పల్లి, గౌలిదొడ్డి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి, ఓఆర్‌ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నాయి. ఈ మార్గం ద్వారా కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు బిజినెస్ హబ్‌లకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం అందనుంది. అలాగే నల్లగండ్ల, గోపన్‌పల్లి, గౌలిదొడ్డి ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా ఈ బస్సులు ఉపయోగకరంగా మారనున్నాయి.
ఈ మార్గంలో పుష్పక్ బస్సులను నడపాలన్న ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్లు, కాలనీలకు సమీపంలోని ప్రాంతాల మీదుగా బస్సులు నడవడం వల్ల స్థానికులకు విమానాశ్రయానికి చేరుకోవడం సులభతరం కానుంది. పటాన్‌చెరు, నల్లగండ్ల ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సుమారు 45 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఈ సర్వీసులు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
ముఖ్యంగా రద్దీ సమయాల్లో, అర్ధరాత్రి వేళల్లో ప్రైవేట్ క్యాబ్‌ల ఛార్జీలు అధికంగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి పుష్పక్ బస్సులు ప్రత్యామ్నాయంగా నిలవనున్నాయి. క్యాబ్‌లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో విమానాశ్రయానికి చేరుకునే అవకాశం కలగనుంది. ఒంటరిగా ప్రయాణించే వారు, ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కొత్త బస్సు సర్వీసులు సౌకర్యవంతమైన రవాణా మార్గంగా ఉపయోగపడనున్నాయి. అయితే, బస్సుల ప్రారంభ తేదీ, టికెట్ ధరలు, సమయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
