
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై విచారణ చేపట్టిన ధర్మాసనం, నామినేషన్లకు సంబంధించిన తుది జాబితా ప్రకటనను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని ఆదేశించినట్లు సమాచారం.
నామినేషన్ల గడువును పొడిగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలపై బుధవారం విచారణ జరిగింది.
నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 22వ తేదీలోగా అర్హులైన అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించాలని స్పష్టం చేసింది.
అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశం
నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు, వారి ప్రతిపాదకులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ నిఘా తప్పనిసరిగా ఉండేలా చూడాలని రాష్ట్ర డీజీపీకి సూచించింది.
కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికారులు తీసుకున్న చర్యలను తదుపరి విచారణలో పరిశీలించనుంది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.
