కృష్ణా నది కరకట్ట బలోపేతం, బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.136.25 కోట్లు మంజూరు చేసింది. పులిగడ్డ నుంచి విజయవాడ వరకు 58.5 కిలోమీటర్ల మేర కరకట్ట రహదారి అభివృద్ధి పనులకు ఆర్థికశాఖ తాజాగా ఆమోదం తెలిపింది.

కృష్ణా నది కరకట్ట ప్రధాన రహదారి దెబ్బతినడంతో దాని పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొద్ది నెలల క్రితం జరిగిన కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం.. కరకట్ట రహదారి పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలో 58.5 కిలోమీటర్ల పొడవైన కరకట్టను బలోపేతం చేయడంతో పాటు బీటీ రోడ్డును పునర్నిర్మించేందుకు రూ.136.25 కోట్ల నిధులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు విజయవాడకు చేరుకునేందుకు ఈ రహదారి కీలకమైన రవాణా మార్గంగా ఉంది. అంతేకాకుండా కృష్ణా నది పరివాహక గ్రామాలకు వరదల ముప్పు నుంచి రక్షణ కల్పించడంలో కరకట్ట ప్రాధాన్యత ఎంతో ఉంది.

ఈ పనులు పూర్తయితే రహదారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు కరకట్ట బలోపేతం ద్వారా పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *