కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తన తొలి పోస్ట్‌గా ‘Belonging: A Journey of Love’ పేరుతో రూపొందిన ఆత్మకథ ఫస్ట్ లుక్‌ను ఆమె పంచుకున్నారు. తన జీవితంలోని ప్రేమ, కర్తవ్యం, విషాదాలు, తనకంటూ ఒక గుర్తింపును వెతుక్కుంటూ సాగిన ప్రయాణాన్ని ఈ పుస్తకంలో వివరించినట్లు సోనియా గాంధీ వెల్లడించారు. తన జీవిత కథను పాఠకులతో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఆత్మకథ తొలి ప్రతులను అందుకున్న సోనియా గాంధీ, తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి పుస్తకాలను పరిశీలించారు. పుస్తకంలో అనేక ఫొటోలు ఉన్నాయని ప్రియాంకకు చూపిస్తూ సోనియా చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. అనంతరం ప్రియాంక తన తల్లికి స్వీట్లు తినిపించగా ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియోనే సోనియా తన తొలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా షేర్ చేశారు.

ఆత్మకథలో వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు

‘Belonging: A Journey of Love’ పుస్తకంలో సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన పలు కీలక అంశాలను పొందుపరిచారు. యుద్ధానంతర ఇటలీలో గడిపిన బాల్యం, రాజీవ్ గాంధీతో పరిచయం వివాహానంతరం భారత్‌కు రావడం నెహ్రూ గాంధీ కుటుంబంతో అనుబంధం వంటి విశేషాలను వివరించారు.

అలాగే 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్యతో తన జీవితంలో చోటుచేసుకున్న విషాద పరిణామాలనూ ప్రస్తావించారు. ఈ ఘటనల అనంతరం రాజకీయాల్లోకి ఆమె ప్రవేశించిన తీరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పోషించిన పాత్రను కూడా ఆత్మకథలో వివరించినట్లు సమాచారం.

ప్రచురణ సంస్థ మార్పు

ఈ పుస్తకాన్ని తొలుత ప్రచురించేందుకు ముందుకొచ్చిన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. అనంతరం హార్పర్‌కాలిన్స్ ఇండియా ఈ ఆత్మకథ ప్రచురణ బాధ్యతలు చేపట్టింది. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ పుస్తకంపై రాజకీయ సాహిత్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *