
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఆయన సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు భార్య అనిత వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. రెండు కుటుంబాల మధ్య రాజకీయ విభేదాల నేపథ్యంలో ఈ పోటీ స్థానికంగా చర్చనీయాంశమైంది. అయ్యన్నపాత్రుడు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
గతంలో రాష్ట్ర మంత్రిగా ఎంపీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సతీమణి పద్మావతి 2021లో తొలిసారిగా నర్సీపట్నం మునిసిపాలిటీలోని 25వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో వారి చిన్న కుమారుడు రాజేశ్ 24వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
అయితే అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ మునిసిపల్ చైర్పర్సన్ పదవిని దక్కించుకుంది. కౌన్సిల్ సమావేశాల్లో పట్టణ సమస్యలపై పాలకవర్గాన్ని నిలదీస్తూ పద్మావతి ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రస్తుతం చైర్పర్సన్ పదవిని లక్ష్యంగా చేసుకుని కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు సన్యాసిపాత్రుడు సతీమణి అనితకు కూడా స్థానిక రాజకీయాల్లో అనుభవం ఉంది.
ఆమె 2004 నుంచి 2006 వరకు నర్సీపట్నం పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. 2011లో నర్సీపట్నం, బలిఘట్టం, పెదబొడ్డేపల్లి పంచాయతీలను కలిపి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అనంతరం 2014లో జరిగిన తొలి మునిసిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా 24వ వార్డు నుంచి సన్యాసిపాత్రుడు 25వ వార్డు నుంచి అనిత విజయం సాధించారు.
టీడీపీకి అత్యధిక స్థానాలు రావడంతో అనిత చైర్‌పర్సన్‌గా సన్యాసిపాత్రుడు వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కాలక్రమంలో అయ్యన్నపాత్రుడు సన్యాసిపాత్రుడు మధ్య విభేదాలు తలెత్తాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరారు. 2021 మునిసిపల్ ఎన్నికలకు ఆయన కుటుంబం దూరంగా ఉంది. అదే ఏడాది అనితకు డీసీసీబీ చైర్పర్సన్ పదవి దక్కగా 2023 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా నర్సీపట్నం మునిసిపల్ చైర్పర్సన్ పదవికి పోటీ చేస్తున్నారు.
