
వెబ్‌డెస్క్: నగరాల రద్దీకి దూరంగా, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఓ చిన్న గ్రామం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. డెన్మార్క్ రాజ్యానికి చెందిన ఫారో దీవుల్లోని ఈస్టురాయ్ ద్వీపంలో ఉన్న గ్యోగ్వ్ (Gjógv) గ్రామం అందమైన కొండలు, నీలి సముద్రం, సంప్రదాయ గృహాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొన్ని డజన్ల మంది మాత్రమే శాశ్వత నివాసితులుగా ఉన్నారు.
సముద్రాన్ని తాకే సహజ లోయ
ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణ దాదాపు 200 మీటర్ల పొడవైన సహజ సముద్ర లోయ. రాతి తీరాన్ని చీల్చుకుంటూ సాగే ఈ జలమార్గాన్ని గతంలో మత్స్యకారులు పడవలను సురక్షితంగా నిలిపేందుకు ఉపయోగించేవారు.
గడ్డితో కప్పిన ఇళ్లు.. పాత చర్చి
పచ్చని కొండల మధ్య రంగురంగుల ఇళ్లు, గడ్డితో కప్పిన పైకప్పులు గ్రామానికి ప్రత్యేక అందాన్ని తీసుకొస్తాయి. 1929లో నిర్మించిన చర్చి కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.
ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం
గ్యోగ్వ్ నుంచి సమీపంలోని ఫన్నింగుర్ గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల నడక మార్గం ఉంది. కొండలు, సముద్ర దృశ్యాల మధ్య సాగే ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. సముద్రంలోని బూగ్విన్ రాతి శిల, అరుదైన సముద్ర పక్షులు మరో ప్రత్యేక ఆకర్షణ.
ఎలా చేరుకోవాలి?
ఫారో దీవుల రాజధాని తోర్షావ్న్ నుంచి రహదారి మార్గంలో గ్యోగ్వ్‌కు చేరుకోవచ్చు. అంతర్జాతీయ పర్యాటకులు వాగర్ విమానాశ్రయం నుంచి కారులో ప్రయాణించవచ్చు.
ఇక్కడ వాతావరణం వేగంగా మారుతుంటుంది. అందువల్ల రెయిన్‌ప్రూఫ్ జాకెట్లు, వెచ్చని దుస్తులు వెంట తీసుకెళ్లడం మంచిది. వేసవిలో పగటి వెలుతురు ఎక్కువగా ఉండటంతో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు, ట్రెక్కింగ్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.
