
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ప్రసార వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.27,370 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 (GEC-III) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌ను జాతీయ గ్రిడ్‌కు అనుసంధానించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7,872 సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ ప్రసార లైన్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే రామాయపట్నం కొప్పాక ప్రాంతాల్లో కొత్తగా 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. మొత్తం 9,500 ఎంవీఏ సామర్థ్యంతో కొత్త సబ్‌స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.
2029-30 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. 2029-30 నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యంగా రామాయపట్నంలో ఏర్పాటు చేయనున్న 400 కేవీ సబ్‌స్టేషన్ ద్వారా పోర్టు ప్రాంతాలు పారిశ్రామిక క్లస్టర్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని ప్రణాళిక రూపొందించారు. కొప్పాకలో మరో 400 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ప్రసార సామర్థ్యం పెరగనుంది.
గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 అమలుతో సౌర పవన విద్యుత్‌తో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడం సులభతరం కానుంది. దీనివల్ల రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగం విస్తరణకు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతానికి అవకాశం కలగనుంది.
