
కోనసీమలో ఆర్నబ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, వలస మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆర్డీవో సరళాదేవి తీర ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
తుఫాన్ ప్రభావంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప సముద్ర తీరంలో ఉన్న మత్స్యకార కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వేట కోసం కోనసీమకు వచ్చిన విశాఖపట్నం జిల్లా నక్కపల్లికి చెందిన సుమారు 400 మంది వలస మత్స్యకారులను తుఫాన్ షెల్టర్లకు తరలించారు. అమలాపురం డివిజన్‌లో మరో 1,000 నుంచి 1,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్డీవో సరళాదేవి తెలిపారు.
మరోవైపు తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లి సహకరించాలని యంత్రాంగం కోరుతోంది.
