వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాజమండ్రి నుంచే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటుకు బీజం పడిందని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో 97 శాతం పంటల సాగు జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నం పర్యటనకు వెళ్లినప్పుడు నగర బహిష్కరణ చేశారని ఆరోపించారు. తనను సైతం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేసి వేధించారని విమర్శించారు.

రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు.

2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని విమర్శించారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాల నిధులను మళ్లించి వాటిని సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పథకాలను పునరుద్ధరించామని వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్‌ హింసను విడనాడి రాజకీయాల్లోకి రావాలని సూచించారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే మద్దతివ్వాలి

రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి బీ-ఫారం పొందిన అభ్యర్థులకే ఓటు వేయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికలను తమ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చే తీర్పుగా భావిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల కంటే అధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి మరింత బలాన్ని ఇస్తుందని అన్నారు.

పోలవరం పూర్తితో రాయలసీమకు ప్రయోజనం

పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని ప్రస్తావించిన చంద్రబాబు దీని నిర్మాణం పూర్తయితే కృష్ణా జలాలను రాయలసీమకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు. పోలవరం పూర్తితో రాష్ట్రంలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు రాయలసీమ ప్రాంతంలో నీటి లభ్యతను మెరుగుపరిచేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి సాగునీటి అవసరాల సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *