
‘చెప్పాం చేస్తున్నాం’ నినాదంతో సానుకూల వాతావరణంలో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి పార్టీల మధ్య క్షేత్రస్థాయిలోనూ సమన్వయం సాధించి సీట్ల సర్దుబాటుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నామని వెల్లడించారు.
సుదీర్ఘ చర్చలు కసరత్తు అనంతరం మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని మాధవ్ పేర్కొన్నారు. కూటమిలో విభేదాలు వస్తాయన్న ప్రత్యర్థుల అంచనాలకు తావివ్వకుండా ఐక్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కూటమి సమన్వయంతోనే సూపర్ ఎల్‌నినో సహా పలు సవాళ్లను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా స్థానిక ఎన్నికలను ఎదుర్కొంటున్నామని మాధవ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని ప్రజల ఆశీస్సులు తమకు అవసరమని కోరారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేషంగా కృషి చేశారని తెలిపారు.
మూడు పార్టీల మధ్య ఉన్న సమన్వయం ఐక్యత అభినందనీయమని మాధవ్ పేర్కొన్నారు. ఉమ్మడి నిర్ణయాలతో ముందుకు సాగుతున్నామని గత సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక ఎన్నికల్లోనూ ఐక్యంగా పోటీ చేస్తామని వెల్లడించారు.
