
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అధికారులు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానం ఆసక్తికరంగా మారింది. ఓ హత్య కేసులో నిందితుడిగా అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేత, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు.
సత్యనారాయణరెడ్డి తరఫున తొలుత ఆయన, ఆయన భార్య కామిరెడ్డి ప్రభావతమ్మ వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ప్రభావతమ్మ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో సత్యనారాయణరెడ్డి నామినేషన్ ఆమోదం పొంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆయన జైలులో ఉండటంతో భార్య ప్రభావతమ్మ ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు.
లేఖ ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి
ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీసుల అనుమతితో సత్యనారాయణరెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అందించిన సేవలను గుర్తించాలని కోరారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలకు సేవలందించానని పేర్కొంటూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తాను సొసైటీ ప్రెసిడెంట్‌గా, 2012లో వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్‌గా, 2014, 2019లో మండల పరిషత్ అధ్యక్షుడిగా, 2021లో ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా పనిచేసినట్లు లేఖలో వివరించారు. పెళ్లకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు
తిరుపతి జిల్లాలో గత నెలలో జరిగిన బాలయ్య హత్య కేసులో సత్యనారాయణరెడ్డి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోగా, అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. భూమి వివాదమే హత్యకు కారణమై ఉండవచ్చని సమాచారం.
ఒకవైపు జైలులో ఉంటూనే ఎన్నికల బరిలో నిలిచిన సత్యనారాయణరెడ్డి, మరోవైపు ఆయన తరఫున భార్య ప్రభావతమ్మ ప్రచారం నిర్వహిస్తుండటంతో పెళ్లకూరు జెడ్పీటీసీ ఎన్నిక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
