
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ మాత్రం హింస, అసత్య ప్రచారాలను నమ్ముకుందని విమర్శించారు. అమరావతిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదన్నదే వైసీపీ నేతల ఆలోచనగా ఉందని ఆరోపించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు 60కి పైగా పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
26 వేల నామినేషన్లు దాఖలు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 26 వేల నామినేషన్లు వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గొడవలు సృష్టించి కోర్టులను ఆశ్రయిస్తున్నారు
కొంతమంది నేతలు ముందుగా వివాదాలు సృష్టించి, అనంతరం కోర్టులను ఆశ్రయిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కూటమి పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
