
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. నామినేషన్ల గడువును పొడిగించాలంటూ వైసీపీ చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై విచారణను ముగించింది.
గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలను అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు నివేదించింది. నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయాలని, అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వాటి ఫుటేజీని భద్రపరచాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే గత విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తీసుకున్న చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరించింది.
ఎన్నికల సంఘం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో దాన్ని పొడిగించాలన్న వైసీపీ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించకపోవడంతో ఈ పిటిషన్పై విచారణ ముగిసింది.
