
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామ పరిధిలోని పంట పొలాల్లో పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్జీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సైతం హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ఓఎన్జీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఇదే ప్రాంతంలో ఈ నెల 26న కూడా గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకుంది. తాజాగా మరోసారి అదే ప్రాంతంలో పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే లీకేజీని పూర్తిస్థాయిలో అదుపు చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
