
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ పులివెందులకు వచ్చిన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఆరోపించిన ఆయన రీపోలింగ్ నిర్వహిస్తేనే మళ్లీ వచ్చి ఓటు వేస్తానని ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెంగళూరు నుంచి పులివెందులకు చేరుకున్న జగన్ పోలింగ్ సరళిపై మీడియా ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును పరిశీలిస్తే ఎన్నికల సంస్కరణలు ఎంత అవసరమో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరి చేతుల్లో ఉందో ప్రజలందరికీ తెలుసని ఆరోపించారు.
పులివెందుల నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో 70 మంది వైసీపీ పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించారని జగన్ ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అనంతరం ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆయన అక్కడ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను ప్రస్తుత ఎన్నికల్లో ఓటు వేయబోనని జగన్ స్పష్టం చేశారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహిస్తేనే బెంగళూరు నుంచి తిరిగి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత తన ఓటు వేయకుండానే తిరిగి బెంగళూరుకు పయనమయ్యారు.




