ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 8 గంటల వరకు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 1న పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నమోదైన ఓట్లను అధికారులు నేడు లెక్కిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో 47,817 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించే ముందు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఎన్నికల ఫలితాలను ప్రకటించేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

By Ramya