
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బాబా జయంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం దేశ, విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పుట్టపర్తికి తరలివచ్చారు. దీంతో పట్టణమంతా సత్యసాయి భక్తులతో కిక్కిరిసిపోయింది. జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పట్టణవ్యాప్తంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కాగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ఇక బాబా 101వ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సమాజానికి ప్రజలకు సత్యసాయి బాబా అందించిన సేవలను కొనియాడారు. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా బాబా భక్తులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.




