
D Spiritual: Nov 23: శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక.. విలువ రూ.160 కోట్లు!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు భారీ బంగారు కానుక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. స్వామివారిపై తనకున్న అపార భక్తిని చాటుకుంటూ ఏకంగా 121 కిలోల బంగారంతో ప్రత్యేక ఆభరణాలను తయారు చేయించారు. వీటి విలువ సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొత్తం 9 సెట్లుగా 45 రకాల ఆభరణాలను రూపొందించారు. ఈ ఆభరణాలను శ్రీవారి సేవకు సమర్పించేందుకు భక్తుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
ఈ నెల 26న తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో టీటీడీ అధికారులకు ఈ బంగారు ఆభరణాలను అధికారికంగా అందజేయనున్నారు. భారీ మొత్తంలో బంగారంతో రూపొందించిన ఈ కానుక ప్రస్తుతం భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టీటీడీ అధికారులతో సంప్రదింపులు
భారీ బంగారు కానుక సమర్పణకు సంబంధించి సదరు భక్తుడు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఆభరణాల సమర్పణకు అవసరమైన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.
మొత్తం 121 కిలోల బంగారంతో 45 రకాల ఆభరణాలను 9 సెట్లుగా తయారు చేయించి స్వామివారికి సమర్పించనుండటంతో ఈ కానుకకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.



