
D Spiritual; Nov 23: 24న ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం
ఇంద్రకీలాద్రి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న ఈ వేడుకలను కనులపండువగా తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆదేశించారు.
ఎనిమిది సెక్టార్లలో ప్రత్యేక అలంకరణలు
దీపోత్సవం సందర్భంగా ఇంద్రకీలాద్రి పరిసరాలను ఎనిమిది ప్రధాన సెక్టార్లుగా విభజించి ప్రత్యేక అలంకరణలు చేపడుతున్నారు. ప్రధాన ఆలయం, అష్టలక్ష్మి మండపం, ఉపాలయాలు, ఆర్జిత సేవా ప్రాంగణాలు, చిన్న రాజగోపురం, ఓం టర్నింగ్, శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయ మార్గం, మహామండపం నుంచి దిగువన ఉన్న కనకదుర్గ నగర్ ప్రారంభం వరకు దీపాలంకరణలు చేయనున్నారు.
700 మందికి పైగా సేవాదారులతో దీపాలంకరణ
వివిధ సెక్టార్లలో ఓం, స్వస్తిక్, శివలింగం, శ్రీచక్రం వంటి ఆధ్యాత్మిక ఆకృతుల్లో రంగవల్లులు తీర్చిదిద్దనున్నారు. పూల అలంకరణలు, దీపాల ఏర్పాట్ల కోసం 700 మందికి పైగా సేవాదారులను వినియోగించనున్నారు. అదేవిధంగా మామిడి తోరణాలు, అరటి చెట్లతో ఆలయ పరిసరాలను సంప్రదాయబద్ధంగా అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మల్లేశ్వరాలయంలో జ్వాలాతోరణం కార్యక్రమం
కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా అదే రోజు రాత్రి శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.




