
ఒంగోలు కార్పొరేషన్‌లోని 27వ డివిజన్ నుంచి పోటీ చేసిన చావలి చర్పితకు టీడీపీ అధిష్టానం కీలక అవకాశం కల్పించింది. ఆమెను ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా ఎంపిక చేసింది. యువతకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో చర్పితకు ఈ పదవిని కేటాయించినట్లు తెలుస్తోంది.
చర్పితకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. తన తాతయ్య, అమ్మమ్మల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వైపు వెళ్లకుండా ప్రజాసేవను లక్ష్యంగా ఎంచుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కించుకోవడంతో ఆమె ఎంపిక చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట పడింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ యువత పోటీ చేసి విజయాలు సాధించారు. అంతేకాదు.. మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, జెడ్పీ ఛైర్మన్లు, ఎంపీపీలు వంటి కీలక పదవులు కూడా యువ నాయకులకు దక్కాయి.
ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 24 ఏళ్ల వయసులోనే చావలి చర్పిత కార్పొరేటర్‌గా విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొన్న తీరు, మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అప్పట్లోనే చర్పిత పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది
తాజాగా చావలి చర్పితకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా ఆమె ఎంపికయ్యారు. కార్పొరేటర్‌గా విజయం సాధించి సంతోషంలో ఉన్న ఆమెకు ఇప్పుడు ఏకంగా డిప్యూటీ మేయర్ పదవి వరించింది. ఒంగోలు కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ బాధ్యతలను మహిళలే చేపట్టడం విశేషం. ఈ మేరకు మేయర్‌గా శ్రీశిల్ప, డిప్యూటీ మేయర్‌గా చావలి చర్పిత ప్రమాణ స్వీకారం చేశారు. చిన్న వయసులోనే కీలక పదవి దక్కించుకోవడంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తనకు ఈ అవకాశం కల్పించిన టీడీపీ అధిష్టానానికి చర్పిత కృతజ్ఞతలు తెలిపారు.
ఒంగోలు 27వ డివిజన్ నుంచి పోటీ చేసిన చర్పిత ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరునవ్వుతో ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం చేసిన ఆమె వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై విజయం సాధించి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
చర్పిత ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఒంగోలులో మున్సిపల్ కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వైపు వెళ్లకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒంగోలు 27వ డివిజన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో యాదవ సామాజికవర్గానికి చెందిన చర్పిత ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టి మరింత కీలక స్థానానికి చేరుకున్నారు.
చావలి చర్పిత కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం కొనసాగుతోంది. చర్పిత తాతయ్య చావలి కృష్ణయ్య గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆమె అమ్మమ్మ అనంతమ్మ ప్రస్తుతం అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా తాతయ్య, అమ్మమ్మల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ చర్పిత కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆమె 27వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. తనను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో చర్పిత స్వయంగా ఓటర్లను కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆమె రాజకీయ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు.




