
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర చరిత్రలోనే ఒక కీలక ఘట్టమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు.
ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.
మంకమ్మతోటలోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు, ఇంటింటికీ వెళ్లి ప్రజలకు బొట్టు పెట్టి దీక్షా దివస్ సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, అమరుల త్యాగాలు, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో రాష్ట్ర ఏర్పాటు దిశగా చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించారు.
నాయకులు స్వయంగా ఇళ్లకు వచ్చి ఆత్మీయంగా పలకరిస్తూ ఆహ్వానించడంతో స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పలువురు సభకు తప్పకుండా హాజరై విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు హామీ ఇచ్చారు. ప్రజల నుంచి లభించిన స్పందనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.




