
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ఈ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇప్పటివరకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 96 శాతం భూసేకరణ పూర్తయినప్పటికీ.. కేంద్ర కేబినెట్ ఆమోదం ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కనీసం 90 స్థానాల్లో విజయం సాధిస్తామని, తాను రూపొందించిన ప్రణాళిక ప్రకారం పార్టీ ముందుకు సాగితే 100కు పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు.
సోమవారం గాంధీభవన్‌లో పార్టీ ఇన్ఛార్జ్ బీఎం సందీప్‌తో సమావేశమైన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు వారికి సముచిత పదవులు కల్పించాలని రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ను కోరినట్లు తెలిపారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు చేశారు. తెలంగాణకు 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపకుండా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
ముఖ్యంగా తెలంగాణకు అత్యంత కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కోమటిరెడ్డి తప్పుబట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 96 శాతం భూసేకరణ పూర్తయినప్పటికీ కేంద్ర కేబినెట్ ఆమోదం ఎందుకు లభించడం లేదని ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియను మూడుసార్లు వాయిదా వేసినట్లు ఆరోపించారు.
మరోవైపు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.12 వేల కోట్లతో చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించినప్పటికీ.. పనులను ఎందుకు పెండింగ్‌లో ఉంచారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం జాప్యం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో నిర్లక్ష్యం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం అవసరమైన అన్ని అనుమతులు, ప్రతిపాదనలను సిద్ధం చేసినప్పటికీ.. బీజేపీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రాజకీయాలను పక్కనపెట్టి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ తక్షణమే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
ఇదే సందర్భంగా గాంధీభవన్‌తో తనకున్న అనుబంధాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఏడేళ్లపాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు తన శాఖ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కోమటిరెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నానని, ఒక్కరోజు కాదు.. ఒక్క గంట కూడా విరామం లేకుండా అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తున్నానని పేర్కొన్నారు.



