కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. ఈ ఎన్నిక సందర్భంగా జనసేన పార్టీకి చెందిన కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకే పార్టీకి చెందిన సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొంతసేపు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

ఈ పరిణామంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది. చివరకు పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని నాయకులు కౌన్సిలర్లను ఒప్పించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం బొజ్జ వెంకటేశ్వరరావు పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక గందరగోళం, తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. ఈ ఎన్నిక సందర్భంగా అధికార జనసేన పార్టీకి చెందిన కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోవడంతో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

పార్టీ అధిష్ఠానం తరఫున బీ-ఫారమ్ పొందిన బొజ్జ వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వంపై మెజార్టీ జనసేన కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు బదులుగా మరో కౌన్సిలర్ పిండి సంధ్యకు వైస్ ఛైర్మన్ పదవి కేటాయించాలని పట్టుబట్టారు. దీంతో సభలో ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకే పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొంతసేపు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిణామంతో పిఠాపురం మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రంగంలోకి దిగారు. అసమ్మతి కౌన్సిలర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపి, వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కౌన్సిలర్లకు నచ్చజెప్పడంతో వివాదం క్రమంగా సద్దుమణిగింది. చివరకు బొజ్జ వెంకటేశ్వరరావు పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కార్యాలయం వెలుపల స్వల్ప ఉద్రిక్తత

మరోవైపు వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వెలుపల కూడా కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల్లో అనవసరమైన పోటీకి, కౌన్సిలర్ల మధ్య విభేదాలకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడు చక్రీ కారణమంటూ జనసేనలోని ఓ వర్గం నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు ఆందోళనకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కొందరు నాయకులు చక్రీపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే వెంటనే అప్రమత్తమైన మరో వర్గం జనసేన నాయకులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా చక్రీని సురక్షితంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు.

ఇలా అంతర్గత విభేదాలు, వర్గపోరు, స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక.. ముఖ్య నాయకుల జోక్యంతో చివరకు ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *