
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన మాటలు వింటే చివరకు మిగిలేది కక్షలు, అప్పులేనని ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా కూటమి విజయం సాధించిందంటూ వైసీపీ నేతలు విమర్శలు చేశారని ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఏమని సమాధానం చెబుతారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు.
కడప, పులివెందుల ప్రాంతాల్లోనూ ప్రజాస్వామ్యమే విజయం సాధించిందని అన్నారు. పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని కూటమి క్లీన్ స్వీప్ చేసిందని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ, రాజకీయ విభేదాలకు తావివ్వకుండా ఏకగ్రీవ ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వాలని సోమిరెడ్డి సూచించారు.
రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకాభిప్రాయంతో సర్పంచ్లను ఎన్నుకోవాలని కోరారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆయన వెల్లడించారు.




