
ఆసియాలో చైనా, భారత్ మధ్య ఉన్న శక్తి అంతరం గత ఎనిమిదేళ్లతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని పేర్కొంది. లోవీ ఇన్‌స్టిట్యూట్ తాజాగా విడుదల చేసిన ‘ఆసియా పవర్ ఇండెక్స్–2026’లో ఈ వివరాలను వెల్లడించింది.
అదే సమయంలో అమెరికా, చైనా మధ్య శక్తి అంతరం కూడా తగ్గుతున్నట్లు నివేదిక విశ్లేషించింది. ఆర్థిక, సైనిక రంగాల్లో అమెరికా ఆధిపత్యం కొంతమేర బలహీనపడుతుండగా.. చైనా మాత్రం తన శక్తిని స్థిరంగా కొనసాగిస్తోందని పేర్కొంది. ఆసియాలో మారుతున్న ఆర్థిక, రాజకీయ, సైనిక సమీకరణాలకు ఈ నివేదిక అద్దం పడుతోంది.
ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుందని లోవీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘ఆసియా పవర్ ఇండెక్స్–2026’ వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి అంచనాలు, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న దౌత్య ప్రభావం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం భారత్ ఈ స్థానాన్ని సాధించడానికి దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తర్వాత ఆసియాలో రెండో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ప్రధాని మోదీ నిలిచినట్లు వెల్లడించింది.
2018లో ఆసియా పవర్ ఇండెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్, చైనా మధ్య శక్తి అంతరం ప్రస్తుతం అత్యంత కనిష్ఠ స్థాయికి చేరినట్లు నివేదిక విశ్లేషించింది. అయినప్పటికీ, మొత్తం శక్తి పరంగా చైనా భారత్ కంటే 80 శాతం అధికంగా ఉందని స్పష్టం చేసింది.
ఎనిమిది అంశాల్లో ఐదింటిలో భారత్ పురోగతి
ఆసియా దేశాల శక్తిసామర్థ్యాలను అంచనా వేయడానికి లోవీ ఇన్‌స్టిట్యూట్ మొత్తం ఎనిమిది ప్రధాన విభాగాలను ప్రామాణికంగా తీసుకుంది. వీటిలో ఐదు విభాగాల్లో భారత్ పురోగతి సాధించగా, మిగిలిన మూడు విభాగాల్లో స్వల్పంగా వెనుకబడింది.
ముఖ్యంగా దౌత్య ప్రభావం విషయంలో భారత్ స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్లు నివేదిక పేర్కొంది. అనేక ఆసియా దేశాలు ఈ విభాగంలో తమ ప్రభావాన్ని కోల్పోతున్నప్పటికీ, భారత్ మాత్రం తన దౌత్య సంబంధాలు, అంతర్జాతీయ ప్రాధాన్యతను నిలకడగా కొనసాగిస్తోందని విశ్లేషించింది.
భారత్ రక్షణ సామర్థ్యాలు, సాంస్కృతిక ప్రభావం ఆసియాలో దేశ ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయని ఆసియా పవర్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా రక్షణ ఒప్పందాలు, ఆగ్నేయాసియా దేశాలకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాలు రక్షణ రంగంలో భారత్ స్థానాన్ని మెరుగుపరిచాయని పేర్కొంది. ఈ విభాగంలో భారత్ తొమ్మిదో స్థానానికి చేరినట్లు తెలిపింది.
సాంస్కృతిక ప్రచారం, సమాచార వ్యాప్తి, ప్రజల మధ్య పరస్పర రాకపోకలు పెరగడంతో భారత్ సాంస్కృతిక ప్రభావం 43.8 పాయింట్లకు చేరినట్లు లోవీ ఇన్‌స్టిట్యూట్ వివరించింది.
భారత్ తన అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకుంటూ, 2018తో పోలిస్తే చైనాతో ఉన్న అంతరాన్ని తగ్గించుకుందని లోవీ ఇన్‌స్టిట్యూట్ ఆగ్నేయాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ హంటర్ మార్స్టన్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
భారత్‌కు కొన్ని ప్రతికూలతలు కూడా..
మరోవైపు, భారత్ పురోగతికి కొన్ని అంశాలు ప్రతికూలంగా మారాయని నివేదిక పేర్కొంది. రూపాయి విలువ బలహీనపడటం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నిబంధనల్లో మార్పులు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర తగ్గుదల వంటి పరిణామాలను ప్రస్తావించింది.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం విషయంలోనూ కొన్ని అంశాలను నివేదిక విశ్లేషించింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న వివాదాల సమయంలో భారత్ అనుసరించిన వైఖరి నేపథ్యంలో ఆయన నాయకత్వం, వ్యూహాత్మక ఆశయాలపై ఉన్న అంచనాల్లో కొంత తగ్గుదల నమోదైనట్లు పేర్కొంది.
అయినప్పటికీ, ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌కు భవిష్యత్తులో తన ప్రభావాన్ని మరింత విస్తరించుకునేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని లోవీ ఇన్‌స్టిట్యూట్ అభిప్రాయపడింది.
‘ఆసియా పవర్ ఇండెక్స్–2026’ రూపకల్పనలో భాగంగా లోవీ ఇన్‌స్టిట్యూట్ ఎనిమిది కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. ఆర్థిక, సైనిక సామర్థ్యం, దౌత్యపరమైన ప్రభావం, భవిష్యత్తు వనరులు, రక్షణ నెట్‌వర్క్‌లు, ఆర్థిక సంబంధాలు తదితర విభాగాల్లో మొత్తం 131 సూచికల ఆధారంగా 27 దేశాల శక్తిసామర్థ్యాలను అంచనా వేసింది.
అమెరికాకు చేరువైన చైనా.. తగ్గుతున్న శక్తి అంతరం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో ఆసియా ప్రాంతంపై వాషింగ్టన్ దృష్టి కొంత తగ్గినట్లు నివేదిక విశ్లేషించింది. ఈ పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటూ సైనిక సామర్థ్యంలో అమెరికాకు మరింత చేరువవుతోందని పేర్కొంది. ఇరు దేశాల మధ్య శక్తి అంతరం క్రమంగా తగ్గుతున్నట్లు వెల్లడించింది.
పవర్ ఇండెక్స్ ప్రకారం.. అమెరికా 78.9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, చైనా 73.6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల మధ్య వ్యత్యాసం కేవలం 5.3 పాయింట్లకు పరిమితమైంది. ఆర్థిక, సైనిక సామర్థ్యం, రక్షణ వ్యవస్థలు, దౌత్య ప్రభావం వంటి విభాగాల్లో అమెరికా శక్తి కొంత తగ్గుతుండగా.. చైనా మాత్రం తన సామర్థ్యాన్ని నిలకడగా పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా సైన్యాన్ని ఆధునీకరించడంతో పాటు నౌకాదళ సామర్థ్యాన్ని చైనా నిరంతరం విస్తరిస్తోంది. ఈ పరిణామాలు ఫిలిప్పీన్స్, తైవాన్ వంటి ప్రాంతాల విషయంలో చైనా తన ప్రాదేశిక వాదనలను మరింత బలంగా వినిపించేందుకు దోహదపడుతున్నాయని నివేదిక విశ్లేషించింది.
ఆర్థిక రంగంలోనూ చైనా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోందని పేర్కొంది. అమెరికా డాలర్ నిల్వలు బలంగా ఉన్నప్పటికీ, చైనా ఆర్థికంగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. అంతేకాకుండా, చైనా అధికారిక నిల్వలు అమెరికా నిల్వల కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.




