అమరావతి: రాష్ట్రంలో పాలనను మరింత సమర్థవంతంగా మార్చడంతోపాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యం, వ్యవసాయం సహా అన్ని కీలక రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.

అమరావతిలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) వ్యవస్థపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాలనలో సాంకేతికత వినియోగం, ఏఐ స్టాక్ అమలు, పౌర సేవల పంపిణీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై చర్చించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, శాఖల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

ఏఐ ఆధారిత వ్యవస్థలతో ప్రభుత్వ శాఖల పనితీరులో వేగం, పారదర్శకత పెంచాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు అందించే సేవల్లో జాప్యాన్ని తగ్గించి, మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయాలు పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలు పాలనలో కీలక పాత్ర పోషిస్తాయని సీఎం పేర్కొన్నారు. రెవెన్యూ, లీగల్ ఏఐ స్టాక్ ద్వారా వివిధ అంశాలను విశ్లేషించి కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్థంగా వినియోగించుకుంటే ప్రభుత్వ శాఖల పనితీరును మరింత మెరుగుపరచవచ్చని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *