
రామచంద్రపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ ఛైర్మన్గా మేడిశెట్టి శేషారావు, వైస్ ఛైర్మన్గా కవల నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 32 మంది కౌన్సిలర్ల చేత ఆర్డీఓ, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సరళావతి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్లకు మంత్రి పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడుల ప్రవాహానికి ప్రజలు మద్దతు తెలిపారని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందించారని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించాలని సూచించారు.
అనంతరం వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలలో తేడాలంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 150 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైనప్పటికీ ఓటమిపై సమీక్ష చేసుకోకుండా ఈవీఎంలను నిందిస్తూ గోల చేశారని విమర్శించారు.
ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ కండువాతో నామినేషన్ వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆ పార్టీ జెండా కనిపిస్తే ఓట్లు పడవనే భావనతో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితి వైసీపీకి దాపురించిందంటూ మంత్రి సుభాష్ విమర్శించారు.




