విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. సముద్ర రవాణా అనుసంధానం, ఆధునిక సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆగ్నేయాసియా దేశాలతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన ఏషియన్–ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేశ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ విశాఖపట్నానికి గొప్ప సముద్ర చరిత్ర ఉందని, భారత తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నగరం ప్రస్తుతం వాణిజ్యం, సాంకేతిక రంగాల్లోనూ కీలక కేంద్రంగా ఎదుగుతోందని అన్నారు.

భారత్‌కు ఆగ్నేయాసియా దేశాలతో శతాబ్దాల నాటి సంబంధాలున్నాయని గుర్తుచేశారు. ఆధునిక రవాణా వ్యవస్థలు అందుబాటులోకి రాకముందే తీర ప్రాంతాల మధ్య వ్యాపారులు, పరిశోధకులు ప్రయాణిస్తూ వస్తువులు, విజ్ఞానం, సంస్కృతిని పరస్పరం పంచుకునేవారని వివరించారు. కళింగపట్నం, మచిలీపట్నం వంటి ప్రాచీన నౌకాశ్రయాలు ఈ సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.

ఒకప్పుడు సముద్రమే మన తొలి రహదారి అని పేర్కొన్న మంత్రి, ఆధునిక నౌకాశ్రయాలు, డిజిటల్ సాంకేతికత, స్వచ్ఛ ఇంధన వినియోగంతో అంతర్జాతీయ సముద్ర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. ఈ లక్ష్యంతోనే సదస్సుకు ‘కనెక్టివిటీ–కన్వర్జెన్స్‌–కోఆపరేషన్‌’ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *